సర్ ఫారాలను తప్పనిసరిగా నింపి సమర్పించాలి
భీమ్‌గల్ రూరల్ (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పిప్రి గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జితేందర్ పాల్గొని గ్రామస్తులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అరిగెల జనార్ధన్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ఫారం అందుకున్న ప్రతి అర్హ ఓటరు పూర్తి వివరాలతో ఫారాన్ని నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు. ఫారం సమర్పించకపోతే ఓటరు జాబితాలో పేరు కొనసాగడంపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఫారం నింపడంలో ఇబ్బందులు ఎదురైతే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరు తన హక్కును పరిరక్షించుకునేందుకు ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
