వరద కాలువలో వెంటనే నీటి విడుదల చేయాలి: ఎమ్మెల్యే

వేల్పూర్, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వరద కాలువ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) ద్వారా ఆయకట్టు గ్రామాల రైతులకు సకాలంలో సాగునీరు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. గురువారం వేల్పూర్‌లోని తన నివాసం నుంచి ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాల్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడి వరద కాలువ మరమ్మతులు, రివర్స్ పంపింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. గాండ్లపేట్ సమీపంలో దెబ్బతిన్న కాలువ మరమ్మతులు పూర్తయిన నేపథ్యంలో మిగిలిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి నీటిని విడుదల చేయాలని సూచించారు. సబ్‌కాంట్రాక్టర్ల మధ్య వివాదంతో పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలపగా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒకటి లేదా రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేశారు.

రాబోయే వారం రోజుల్లో రివర్స్ పంపింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, పది రోజుల్లోపు వరద కాలువలో నీటిని విడుదల చేసేలా చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువ పరిధిలోని చెరువులను నింపడంతో పాటు సాగునీటిని పొలాలకు అందించాలని సూచించారు. వరద కాలువపై ఆధారపడి వేలాది ఎకరాల్లో సాగు జరుగుతోందని, నీటి విడుదలలో జాప్యం జరిగితే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోందని అధికారులు వివరించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించి రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.