అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్‌..

  • ఆకస్మిక తనిఖీలో ఎంపీ కేశినేని చిన్ని
  • ప్రయాణికులు, కార్మికులతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా..
  • అమృత్ భారత్ పథకంలో స్టేషన్ అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి..
  • మచిలీపట్నం–గోవా రైలు, అమ్మవారి పేరుతో ప్రత్యేక రైలు కోసం కృషి

విజయవాడ, ఆంధ్రప్రభ: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ను అన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. సోమవారం ఆయన విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ప్లాట్‌ఫారాలు, ప్రయాణికుల వసతులు, పరిశుభ్రత, విశ్రాంతి గదులు, ప్రయాణికుల సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రయాణికులు, రైల్వే కార్మికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, సూచనలు తెలుసుకుని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్‌లో ఎదురవుతున్న సమస్యలను ప్రయాణికులు నేరుగా ఎంపీ దృష్టికి తీసుకురాగా, వాటిపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలను మరింత మెరుగుపరచాలని, పరిశుభ్రత, భద్రత, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, మరుగుదొడ్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా బీఆర్‌కే సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన ఆధునిక ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్‌ను ఎంపీ చిన్ని ప్రారంభించారు. ఏసీ గదులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, విశ్రాంతికి అనువైన వసతులతో ఏర్పాటు చేసిన ఈ రెస్ట్ రూమ్స్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రశంసించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ దేశంలోనే అతిపెద్దదే కాకుండా అత్యంత రద్దీగా ఉండే జంక్షన్ అని పేర్కొన్నారు.

అమృత్ భారత్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్‌లో, కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీపీపీ విధానంలో అభివృద్ధి కోసం కేంద్రం టెండర్లు పిలిచినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని, టెండర్ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వే మంత్రి, సంబంధిత ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ ఈ అంశంపై చర్చించి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నింటినీ అమృత్ భారత్ పథకం కింద ఆధునికీకరించాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో రోజూ సుమారు 1,100 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, వారికి కూడా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఉత్తర–దక్షిణ భారతదేశాలను అనుసంధానించే కీలక జంక్షన్ కావడంతో విజయవాడలో మరిన్ని డార్మిటరీలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ప్రజల నుంచి అధిక డిమాండ్ ఉన్న మచిలీపట్నం–గోవా రైలును ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖతో చర్చలు కొనసాగిస్తున్నామని, అలాగే కనకదుర్గ అమ్మవారి పేరుతో ప్రత్యేక రైలును నడపాలన్న ప్రతిపాదనను కూడా గతంలోనే కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, దానిని సాకారం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ప్రముఖ వ్యాపారవేత్త కే. దస్తగిరి, బీఆర్‌కే సంస్థ ప్రతినిధులు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.