ముత్యాలమ్మ ఆలయం ముందు మురుగు నీరు..
భక్తుల ఇబ్బందులు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో ఉన్న ముత్యాలమ్మ ఆలయం ముందు సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి, చెత్తాచెదారం పేరుకుపోయి ఆలయ పరిసరాలు చిన్నపాటి మురికి కుంటలను తలపిస్తున్నాయి. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయం వంటి పవిత్ర ప్రదేశం పరిశుభ్రంగా ఉండాల్సిన సమయంలో మురుగు నీరు నిల్వ ఉండటం, దుర్వాసన వెదజల్లడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా సర్పంచ్, గ్రామ కార్యదర్శి స్పందించలేదని గ్రామస్థులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సైడ్ కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు ఆలయ పరిసరాలను శుభ్రపరిచి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
