ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
- విశాఖ హార్బర్లో ఉత్కంఠ
- కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన
(విశాఖపట్నం.. ఆంధ్రప్రభ బ్యూరో)
7-fishermen-missing : విశాఖపట్నం హార్బర్ నుంచి చేపలవేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ సమాచారం తీవ్ర ఆందొళనకు గురి చేస్తొంది. వివరాలు ఇలా ఉన్నాయి విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలోని జాలారిపేట జబ్బర్ తోట ప్రాంతంలో నివసిస్తున్న ఏడుగురు మత్స్యకారులు జూలై 1న తెల్లవారుజామున సుమారు 3 గంటలకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో తిరిగి హార్బర్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 4 (శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, తుఫాన్ కారణంగా తిరిగి వస్తున్నామని, మరో గంటలో అంటే మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని సమాచారం ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్‌కు చేరుకోలేదు. బోటులోని మత్స్యకారుల ఆరు మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆరుగురు విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముక్కాం గ్రామంకు చెందిన తత్స్యకారులు కాగా, మరో ఒకరు విశాఖపట్నం జిల్లా, భీమిలి మండలం, పెద నాగమయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు. ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు విశాఖ జాలరిపేటలో జీవిస్తున్నారు. ఈ ఘటన సమాచారంతో మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ , జిల్లా మత్స్యశాఖ , విశాఖ మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని కోరారు.
