వర్షాలతో ఊపందుకున్న వ్యవసాయ పనులు..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఇటీవల కురిసిన వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపాయి. సకాలంలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు ఊపందుకుని, రైతులు పొలాల్లో బిజీగా మారారు.
వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగుకు రైతులు దుక్కి పనులు, విత్తనాల విత్తడం, నాట్లు వేయడం వంటి పనులను వేగంగా చేపడుతున్నారు. అనుకూల వాతావరణం ఉండటంతో మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో భూగర్భ జలమట్టం కూడా పెరుగుతోంది. దీంతో సాగునీటి సమస్య కొంతవరకు తీరుతుందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విధంగా వర్షాలు కొనసాగితే పంటలు ఆశాజనకంగా ఉండటంతో పాటు ఈ ఏడాది మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. దీంతో మండల వ్యాప్తంగా రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
