బలహీన వర్గాల అభ్యున్నతే సర్కారు లక్ష్యం..
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆంధ్రప్రభ: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం దేశానికి ఆదర్శమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ద్వారా సాధికారత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని,
అంబేద్కర్ ఆశయాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, విద్య, ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు
ఇందులో భాగంగా పేదల కొరకు పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని, నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామన్నారు.
అర్హులకు రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని, రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు సన్న ధాన్యం పండించిన రైతులకు బోనస్ చెల్లిస్తున్నామన్నారు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని సమాజంలోని అసమానతులను దూరం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు.
