ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలి..
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్.
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లోని తాళ్లపెట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ స్నేహిత, సిబ్బందితో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు, గర్భవతుల నమోదును 100% పూర్తి చేయాలని, ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పిల్లలకు సకాలంలో టీకాలు అందించాలని, ముఖ్యంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలని సూచించారు.
వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని డెంగ్యూ, మలేరియా వంటి కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీల సహకారంతో డ్రై డే నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉపకేంద్రాల్లో కిట్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు.30 ఏళ్లు పైబడిన వారికి బిపి, షుగర్ పరీక్షలు 100% పూర్తి చేసి, మందులను పంపిణీ చేయాలని, ఈ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఈ-ఔషధి పోర్టల్‌లో మందుల నిల్వలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, ఎక్స్‌పైరీ మందులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ స్నేహిత, సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు.
