విరిగిన విద్యుత్ స్తంభం.. నిద్రపోతున్న విద్యుత్ అధికారులు!
- పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువు
- ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?
- విద్యుత్ శాఖ తీరుపై మండిపడ్డ 18వ వార్డు కౌన్సిలర్ నర్సంపల్లి రాజిరెడ్డి
గుమ్మడిదల, ఆంధ్రప్రభ : గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి కమాన్ నుండి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం విరిగి రేకులపై ఒరిగి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం కళ్లుమూసుకుని వ్యవహరిస్తున్నారని 18వ వార్డు కౌన్సిలర్ నర్సంపల్లి రాజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత ఏఈ, ఏడీఈలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా కనీస స్పందన లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ప్రజల భద్రత కంటే అధికారులకు నిర్లక్ష్యమే ముఖ్యమా అని ప్రశ్నించారు.
ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించిన తర్వాత స్పందిస్తారా? లేక ముందే చర్యలు తీసుకుంటారా? అని విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. వెంటనే విరిగిన స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కౌన్సిలర్ రాజిరెడ్డి హెచ్చరించారు.
