ఏటీఎం బంద్.. ఏసీ మాత్రం 24 గంటలూ ఆన్..!
- ‘నో సర్వీస్’ బోర్డుతో ఖాతాదారులకు ఇబ్బందులు..
- స్పందించాలని ఎస్బీఐ అధికారులకు విజ్ఞప్తి
మంచిర్యాల, ఆంధ్రప్రభ : చిత్రంలో కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని గద్దరాగడి (తిమ్మాపూర్ రోడ్) వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎం. ఇదే ప్రాంగణంలో ఎస్బీఐ ప్రత్యేక శాఖ కూడా ఉంది. అయితే ‘ఎనీ టైమ్ మనీ’ అందించాల్సిన ఈ ఏటీఎం ప్రస్తుతం ‘ఎనీ టైమ్ నో సర్వీస్’గా మారిందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎం పని చేయకపోవడంతో ‘నో సర్వీస్’ అనే బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో నగదు అవసరాల కోసం వచ్చే ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏటీఎం సేవలు నిలిచిపోయినా, అందులోని ఎయిర్ కండీషనర్ (ఏసీ) మాత్రం 24 గంటలూ నిరంతరం పనిచేస్తుండటంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
“ఏటీఎం పనిచేయనప్పుడు ఏసీని ఎందుకు నిరంతరం ఆన్‌లో ఉంచుతున్నారు? ఇలా విద్యుత్‌ను వృథా చేయడం వల్ల ప్రభుత్వ ధనం వృథా కాకపోతుందా?” అని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు.
బ్యాంకు ఖాతాల నిర్వహణ, ఇతర సేవల పేరుతో ఖాతాదారుల నుంచి వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస సేవలు అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ఇకనైనా ఎస్బీఐ అధికారులు స్పందించి ఏటీఎంను వెంటనే మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.
