ముక్కవారిపల్లె వేదికగా వీబీజీ–రామ్‌జీకి ఘన శ్రీకారం

ఫారం పాండ్ శంకుస్థాపన నుంచి పోర్టల్ ప్రారంభం వరకు సందడి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడం విశేషం

తిరుపతి, ఆంధ్రప్రభ: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ–రామ్‌జీ) చట్టానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ స్థాయిలో ఘనంగా శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లెలో గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కలిసి ఫారం పాండ్‌కు శంకుస్థాపన చేసి పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, నీటి సంరక్షణకు ఈ చట్టం కీలకంగా ఉపయోగపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఫారం పాండ్ తవ్వకం పనులను ప్రారంభించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి, జల వనరుల పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం

అనంతరం వీబీజీ–రామ్‌జీ పథకం కింద టేకు, మద్ది, వేప, యూకలిప్టస్‌తో పాటు కలప ఉత్పత్తికి ఉపయోగపడే పలు రకాల మొక్కలను కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయ వనరులు కల్పించే లక్ష్యంతో వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ దిశగా చేపడుతున్న కార్యాచరణను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వివరించారు.

ఆకట్టుకున్న మ్యాజిక్ డ్రెయిన్ నమూనా

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘మ్యాజిక్ డ్రెయిన్’ నమూనా కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మురుగునీటి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న విధానాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పవన్ కళ్యాణ్ వివరించారు. మూడు పొరల నిర్మాణ విధానంతో రూపొందించిన ఈ డ్రెయిన్‌లో వివిధ పరిమాణాల కంకరను వినియోగించి నీటి శుద్ధి, నిర్వహణ చేపడుతున్న విధానాన్ని అధికారులు వివరించారు.

పంచాయతీరాజ్ విజయాల ఫొటో గ్యాలరీ

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు సందర్శించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మోడల్ పంచాయతీలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, జియో ట్యాగింగ్ ఆధారిత పారదర్శక వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఫొటోల ద్వారా పరిశీలించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో రాష్ట్రం సాధించిన విజయాలను అధికారులు వివరించారు.

శిలాఫలకం ఆవిష్కరణ.. జాబ్ కార్డుల పంపిణీ

కార్యక్రమంలో వీబీజీ–రామ్‌జీ శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధి శ్రామికులకు జాబ్ కార్డులను కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందజేశారు. పథకానికి సంబంధించిన ఓపీఈడీ బుక్‌లెట్‌ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించగా, వీబీజీ–రామ్‌జీ అధికారిక పోర్టల్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, సమాచార ప్రసార, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రోహిత్ కన్సాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, శాఖ కమిషనర్ కృష్ణతేజ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.