వింటర్ పొల్యూషన్‌కు చెక్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు

  • కాలుష్య నియంత్రణకు ఢిల్లీ కొత్త ప్లాన్
  • 50% వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు
  • నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రత్యేక ఆంక్షలు
  • పీయూసీ లేని వాహనాలకు ఇంధనం బంద్..
  • పార్కింగ్ ఛార్జీలు డబుల్

ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో ప్రతి ఏడాది శీతాకాలంలో తీవ్రరూపం దాల్చే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం శాశ్వత మాస్టర్ ప్లాన్‌ను నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉండనున్నాయి. కాలుష్య నియంత్రణకు పలు కఠిన చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.

పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం అందించరు. అలాగే నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు కూల్చివేతలు, సివిల్ నిర్మాణ పనులపై నిషేధం అమలు చేయ‌నునట్టు ప్ర‌భుత్వం తెలిపింది.

శీతాకాలంలో కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇదే సమయంలో నగరంలో ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో పార్కింగ్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, రాజధానిని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.