కప్పలదొడ్డిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రం
గూడూరు, ఆంధ్రప్రభ: గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామ రహదారులపై మురుగునీరు నిలిచిపోవడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుండగా, దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మురుగునీటిని తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేయడంతో పాటు గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేలా శాశ్వత చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
