రూ.25 కోట్లతో స్టేడియం నిర్మాణం..

  • అన్ని హంగులు కల్పించాలి
  • అధికారులను ఆదేశించిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ : రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మక్తల్ స్టేడియంలో అన్ని అందులో కల్పించాలని రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్టేడియం నిర్మాణ పనులను మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. మక్తల్ పట్టణంలో రూ.25 కోట్లతో నూతనంగా నిర్మించబోయే స్టేడియం నిర్మాణానికి సంబంధించి అధికారులతో మంత్రి సమీక్ష చేశారు. ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను అధికారులకు సూచించారు. ఆధునిక హంగులతో, అన్ని వసతులతో ఈ స్టేడియం నిర్మాణం ఉండాలని మంత్రి తెలిపారు.

వివిధ క్రీడల్లో వందల మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు స్థానికంగా ఉన్నారని స్టేడియంలో కనీస వసతులు లేకపోవడం వల్ల వారు రాణించలేకపోతున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల స్టేడియం ఎందుకు పని రాకుండా పోయిందన్నారు .వసతులు కల్పిస్తే ఇక్కడ పెద్ద సంఖ్యలో క్రీడాకారులు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేడియంలో పూర్తి వసతులు కల్పించి వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇప్పించి క్రీడారంగానికి ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులను అందించడమే తమ లక్ష్యమని అన్నారు.

శిక్షణ కోసం అవసరమైన కోచులను కూడా ఇక్కడ నియమించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి పూర్తి సదుపాయాలు కల్పిస్తూ ఆధునిక రంగులతో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు .మంత్రి వెంబడి మక్తల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ రవికుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా,వాకిటి హన్మంతు,సరాయి హన్మంతు, వాకిటి అంజి‌ ,వాకిటి శ్యామ్ ,జిల్లా స్పోర్ట్స్ అధికారి వెంకటేష్, ఇంజినీర్ ఉపేందర్ తదితరులు ఉన్నారు.