ఉరుకుంద దేవస్థాన టెండర్ వేలం.. పెరిగిన ఆదాయం
టెంకాయ, కొబ్బరి చిప్పల హక్కులకు పోటాపోటీ బిడ్లు
కౌతాళం, ఆంధ్రప్రభ : కౌతాళం మండలంలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో సోమవారం టెంకాయ, సగభాగం కొబ్బరి చిప్పల పోగు హక్కుల టెండర్ వేలాన్ని నిర్వహించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి ఆధ్వర్యంలో, దేవస్థాన అధికారుల సమక్షంలో జరిగిన వేలంలో పోటాపోటీగా బిడ్లు దాఖలవడంతో గతంతో పోలిస్తే దేవస్థానానికి అధిక ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
టెంకాయ టెండర్లో గట్టూరి ఊలిగయ్య రూ.80 లక్షల అత్యధిక బిడ్‌తో హక్కులను దక్కించుకోగా, సగభాగం కొబ్బరి చిప్పల పోగు హక్కులను గంగుల రామిరెడ్డి రూ.62,10,116కు సొంతం చేసుకున్నారు.
టెండర్ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, దేవస్థాన సిబ్బంది, టెండర్ దారులు పాల్గొన్నారు.
