వేములనర్వలో కూటమికి ఎదురుదెబ్బ…
- 12 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
- దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం
- ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు
- మరింత మంది వైఎస్సార్‌సీపీలో చేరతారని నేతల విశ్వాసం
ఆంధ్రప్రభ, జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం వేములనర్వ గ్రామంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. కూటమికి చెందిన 12 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు ప్రకటించారు.
మాజీ జెడ్పీటీసీ, జనసేన నాయకుడు పొదిలి లక్ష్మీనారాయణ, టీడీపీ సీనియర్ నాయకుడు రాచబంటి చంద్రశేఖర్‌తో పాటు మర్రి లక్ష్మీనారాయణ (సుబ్బారావు), రాచబంటి పుల్లారావు, మల్లాది వెంకటేష్, మాతంగి బాబురావు, మాతంగి దేవమణి, దాది సురేష్, రాచబంటి తిరుపతిరావు, కమతం రాజు, రాచబంటి నాని తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. అలాగే, రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ పరిస్థితుల పట్ల విసుగు చెంది తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తోందని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, ప్రాధాన్యం కల్పిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
