ఏపీఎల్ లీగ్‌కు తెర..
ప్లే ఆఫ్స్‌కు నాలుగు జట్లు
చివరి రోజు వైజాగ్, అమరావతి ఘన విజయాలు
హిమకర్ అర్థశతకం
కామిల్, ఏరా సందీప్ బౌలింగ్‌తో మ్యాచ్‌లపై ముద్ర
రాహుల్ ఆల్‌రౌండ్ షోతో అమరావతి అగ్రస్థానంలో ప్లే ఆఫ్స్‌కు..
భీమవరం, వైజాగ్, విజయవాడతో పాటు అమరావతి నాకౌట్ పోరుకు సిద్ధం
ఆంధ్రప్రభ, విజయవాడ: ఏపీఎల్-2026 సీజన్-5 లీగ్ దశ ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో శనివారం జరిగిన చివరి రోజు డబుల్ హెడర్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్‌కు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాయి. నాలుగు రోజుల లీగ్ దశ అనంతరం క్యాపిటల్ అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి.
వైజాగ్ విజయం…
మొదటి మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్ 21 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వైజాగ్ జట్టుకు ఓపెనర్ హిమకర్ 30 బంతుల్లో 52 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి శుభారంభం అందించాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో జట్టు 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. తుంగభద్ర బౌలర్లలో బ్రహ్మతేజ మూడు వికెట్లు తీశాడు. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్రకు ఆరంభంలోనే వరుస వికెట్లు పడడంతో ఒత్తిడి పెరిగింది. గుత్తా రోహిత్ 60, సౌరభ్ కుమార్ 34 పరుగులతో పోరాడినా జట్టు 20 ఓవర్లలో 140/8కే పరిమితమైంది. వైజాగ్ బౌలర్ కామిల్ మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పగా, ప్రమోద్ కుమార్ రెండు వికెట్లు సాధించాడు. అద్భుత బౌలింగ్‌కు కామిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆధిపత్యంలో అమరావతి…
చివరి లీగ్ మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించి రాయల్స్ ఆఫ్ రాయలసీమపై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమరావతి 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఎస్.వి. రాహుల్ 43 బంతుల్లో 70 పరుగులు (5 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి జట్టు ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలవగా, వరుణ్ సాత్విక్ 19 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జట్టు ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. విష్ణు దత్త 45, కార్తీక్ రామన్ 29 పరుగులతో ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. జట్టు 137 పరుగులకే ఆలౌటైంది. అమరావతి బౌలర్లలో ఏరా సందీప్ నాలుగు వికెట్లతో చెలరేగగా, టోషిత్ యాదవ్, వర్మ చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాట్‌తో రాణించిన ఎస్.వి. రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది.
అగ్రస్థానంలో అమరావతి…
ఏపీఎల్ లీగ్ దశ ముగియడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్‌తో పాటు భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, విజయవాడ సన్ షైనర్స్ జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. టైటిల్ పోరుకు ఇప్పుడు నాకౌట్ సమరం మరింత ఆసక్తికరంగా మారింది.
