విద్యాజ్యోతి అభ్యుదయానికి శ్రీకారం
విద్యాజ్యోతి అభ్యుదయానికి శ్రీకారం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్‌లో వైటీసీ సెంటర్ ఎదుట కోటి రూపాయలతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందమకరందతో కలిసి శనివారం సాయంత్రం భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన “విద్యాజ్యోతి అభ్యుదయం” కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువు పై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయానికి రూ.10 లక్షల విలువైన పుస్తకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. మార్లవాయి గ్రామ విద్యార్థుల విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి సూచించారు. విద్యా సేవలకు విశేష కృషి చేసిన హైమన్ డార్క్ దంపతుల సేవలను ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.
ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించి విద్యపై మరింత ఆసక్తి కలిగిస్తాయని అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించడం ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, క్రీడలు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని సకాలంలో అందించాలని అధికారులను కోరారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆలోచనల మేరకు తొమ్మిది పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే నూతన గ్రంథాలయ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మందమకరంద, ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ఉట్నూర్ ఉప సర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి, ఆదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాథరావు, ఉట్నూర్ ఐ టి డి ఏ ఈ ఈ తానాజీ జాదవ్ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
