ప్రపంచ అథ్లెటిక్స్‌కు భారత్ బిడ్..!
- 2029, 2031 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు భారత్ దరఖాస్తు
- ఆతిథ్య దేశంపై సెప్టెంబరులో తుది నిర్ణయం
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచ అథ్లెటిక్స్ చరిత్రలో మరో కీలక మైలురాయిని అందుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. 2029 లేదా 2031లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ అధికారికంగా బిడ్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమారీవాలా వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీతో పాటు 2028 ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహణకు కూడా భారత్ దరఖాస్తు చేసింది. ఈ రెండు టోర్నీలకు అహ్మదాబాద్‌ను వేదికగా ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ప్రతినిధుల బృందం ఇప్పటికే అహ్మదాబాద్‌ను సందర్శించి స్టేడియాలు, రవాణా, హోటళ్లు, నిర్వహణ, వాతావరణం, ఆహార ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించినట్లు సుమారీవాలా చెప్పారు. అయితే భారత్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటికే ప్రపంచ అథ్లెటిక్స్, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన లండన్, ఒలింపిక్స్ నిర్వహించిన మ్యూనిచ్, రెండు జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లకు వేదికైన కెన్యా కూడా బరిలో ఉన్నాయి.
సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు బుడాపెస్ట్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ ఛాంపియన్షిప్ అనంతరం జరిగే సమావేశంలో ఆతిథ్య నగరంపై తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు ఏఎఫ్ఐ అధ్యక్షుడు వెల్లడించారు. మరోవైపు, రానున్న జపాన్ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు గత ఆసియా క్రీడల కంటే మెరుగైన ప్రదర్శన చేస్తారనే ఆశాభావాన్ని సుమారీవాలా వ్యక్తం చేశారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెటిక్స్‌లో 29 పతకాలు (6 స్వర్ణాలు), బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 8 పతకాలు (ఒక స్వర్ణం) సాధించిన విషయం తెలిసిందే.
