ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ, ఆంధ్రప్రభ : వినుకొండ పట్టణంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిఎల్ఏ, బిఎల్ఓలతో కలిసి 19వ వార్డు నందు శనివారం ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వారి పేర్లు తొలగించకుండా సక్రమంగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ స్వయంగా పరిశీలించుకోవాలని సూచించారు.
ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని పేర్కొంటూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేయాలని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
