జోరుగా ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చేంగల్, ముచ్కూర్, బెజ్జోర, పిప్రి, పెద్దమ్మకాడి తండా, గోనుగోపుల తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అరిగెల జనార్ధన్ విస్తృతంగా పర్యటించారు.
గ్రామాల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేస్తున్న ఎన్యుమరేషన్ పత్రాల ప్రక్రియను వారు పరిశీలించారు. ప్రతి కుటుంబానికి పత్రాలు అందేలా చూడాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రజలకు సర్వే ప్రాధాన్యాన్ని వివరించి పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎస్ఐఆర్ సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం ప్రభుత్వానికి అందుతుందని తెలిపారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా చేయడంతో పాటు, గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల ఉపాధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్, సర్పంచులు దుమాల మమత రాజు, శ్రీనివాస్, కార్తీక్, సేపూర్ చరణ్, ఉపసర్పంచ్ పతాని జేమ్స్ సేవాలాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాక మహేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్ది అవినాష్, కోరాడి రాజు, మండల కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
