బ్రతికున్న వ్యక్తిని మృతుడిగా నమోదు..
క్యాన్సర్ చికిత్సకు ఆటంకం
ఆరోగ్యశ్రీ రికార్డులో పొరపాటు..
డోన్ ఎమ్మెల్యే కోట్లకు బాధితుడి ఫిర్యాదు
డోన్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ రికార్డుల్లో జరిగిన పొరపాటు కారణంగా బ్రతికున్న వ్యక్తిని మృతుడిగా నమోదు చేయడంతో క్యాన్సర్ చికిత్స నిలిచిపోయిన ఘటన డోన్‌లో వెలుగులోకి వచ్చింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన బెస్త శ్రీనివాసులు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యశ్రీ (ఆరోగ్యమిత్ర) పోర్టల్‌లో ఆయనను పొరపాటున మృతుడిగా నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో చికిత్సను కొనసాగించలేమంటూ ఆస్పత్రి వర్గాలు నిలిపివేశాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి నిర్వహించిన పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమంలో బాధితుడు వినతిపత్రం సమర్పించారు. ఆరోగ్యశ్రీ రికార్డుల్లో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్ది, తన క్యాన్సర్ చికిత్స నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. బాధితుడికి న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకుని, చికిత్సకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
