Harish Rao | ముగ్గురు సీఎంల సమావేశంపై మాజీ మంత్రి ప్రశ్నలు
Harish Rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జలవనరుల అంశంపై మాజీ మంత్రి టి.హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 55 టీఎంసీల నీటి నిల్వ ఆధారంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు వాదనలు జరిగిన విషయాన్ని ప్రస్తావించిన హరీశ్‌రావు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాల్గొన్న సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో వెల్లడించాలని కోరారు.
మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ ఒప్పందంలోని అంశాలను రాష్ట్ర ప్రజలకు ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసిందని పేర్కొంటూ, అందులోని అంశాలను కూడా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమావేశానికి బయట ఉంచారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన ఇంజినీర్లు, ఈఎన్సీని కూడా సమావేశంలోకి ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్య గంటపాటు జరిగిన చర్చల్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వివరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
