ఎంఎస్ఎంఈ మహోత్సవ్ 2026కు సర్వం సిద్ధం
- యువ మేధస్సుకు పారిశ్రామిక మార్గదర్శనం.. జూన్ 27న మెగా మేళా
విజయవాడ, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ మహోత్సవ్-2026 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఔత్సాహిక యువత, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల నిపుణులు ఒకే వేదికపైకి వచ్చే ఈ మెగా మేళా యువతకు కొత్త అవకాశాల దారులు తెరుస్తుందని పేర్కొన్నారు.
గురువారం కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్టీఐహెచ్-విజయవాడ సీఈవో జి. కృష్ణన్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. దుర్గాప్రసాద్, జేఆర్డీ టాటా ఐలా ఛైర్మన్ టి. వినోద్‌బాబు, ప్రకాస స్పెక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ టి. పార్థసారథి, జిల్లా పరిశ్రమల అధికారి ఎం. మధుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి కీలక శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో ఎంఎస్ఎంఈలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధికి ఇవి బలమైన వేదికగా నిలుస్తున్నాయని వివరించారు.
యువ మేధస్సుకు అనుభవం జత కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్న కలెక్టర్, పరిశ్రమలు స్థాపించాలని ఆసక్తి ఉన్న యువతకు అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు మార్గదర్శకులుగా నిలిచేలా ఈ మేళాను రూపకల్పన చేసినట్లు తెలిపారు. యువత తమ వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి, ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తుందని చెప్పారు.
“మనం ఇచ్చే గోరంత చేయూత, యువతకు కొండంత బలం అవుతుంది” అని పేర్కొన్న కలెక్టర్, ఈ మేళాను యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మహోత్సవంలో అందరూ భాగస్వాములై యువతను, వారి కొత్త ఆలోచనలను ప్రోత్సహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
