నెహ్రూ పేరు.. ఆశయాలు ఎక్కడ?
- అవినాష్‌పై పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు
విజయవాడ, ఆంధ్రప్రభ: దేవినేని నెహ్రూ పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తున్నప్పటికీ, ఆయన ఆశయాలు, విలువలు, రాజకీయ నిబద్ధతను అనుసరించడంలో దేవినేని అవినాష్ పూర్తిగా విఫలమయ్యారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తండ్రి చెప్పిన మాటలు ఒకవైపు ఉంటే, కుమారుడు అనుసరిస్తున్న రాజకీయ వైఖరి మరోవైపు ఉందని పేర్కొన్నారు. నెహ్రూ జీవితాంతం టీడీపీ జెండాను గౌరవించారని, అయితే ఆయన కుమారుడు అధికార ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అవినాష్‌కు అధికారం లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించిన పట్టాభిరామ్, ఇప్పటికే పలుమార్లు రాజకీయ ఆశ్రయాలు మార్చుకున్నారని విమర్శించారు. వైసీపీ ఓటమి తర్వాత కూడా కొత్త రాజకీయ అవకాశాల కోసం ప్రయత్నించి, అవకాశం దొరకకపోవడంతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
దేవినేని నెహ్రూ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అందించిన అండదండలను గుర్తు చేసిన ఆయన, ఆ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందన్నారు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్‌లపై విమర్శలు చేయడం రాజకీయ కృతఘ్నతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
గుడివాడ క్యాసినో వ్యవహారం, బుడమేరు మట్టి అక్రమ రవాణా అంశాలను ప్రస్తావించిన పట్టాభిరామ్, అధికారంలో ఉన్న సమయంలో స్పందించని నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు అక్రమ ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఆయన, అది దేవినేని నెహ్రూ రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. తండ్రి ఫోటోలకు దండలు వేయడం ద్వారా వారసత్వం రాదని, ఆయన నమ్మిన విలువలు, సిద్ధాంతాలను ఆచరించినప్పుడే నిజమైన వారసత్వం లభిస్తుందని వ్యాఖ్యానించారు.
దేవినేని నెహ్రూ వారసుడినని చెప్పుకునే ముందు ఆయన రాజకీయ నిబద్ధత, విలువలను గుర్తు చేసుకోవాలని అవినాష్‌కు సూచించిన పట్టాభిరామ్, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై అవాస్తవ ఆరోపణలు చేస్తే వాస్తవాలతో గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర బీవోసీడబ్ల్యూ ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పి. చరణ్ సాయి యాదవ్ పాల్గొన్నారు.
