మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

  • కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో గురువారం హనుమకొండలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి పాల్గొన్నారు.

హనుమకొండ ఆదాలత్ సర్కిల్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్లాష్‌మాబ్‌లు, అవగాహన నాటికలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వ్యసనం సమాజానికి పెను సవాలుగా మారుతోందన్నారు. యువత తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు యువతను ప్రోత్సహించడం ద్వారా వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చని తెలిపారు. మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు, విద్యార్థులు, యువతతో కలిసి “మత్తు పదార్థాలను ఉపయోగించము.. ఇతరులను కూడా వాటి నుంచి దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాము” అంటూ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ అవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కజాంపురం దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జి అధికారి ఎస్. ప్రవీణ్ కుమార్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ఎస్. భాస్కర్, మహిళా శక్తి కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ కళ్యాణి, సఖి అడ్మిన్ హైమావతి, డెమో అశోక్ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రాము, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె. అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.