మంచిర్యాలలో దారుణ హత్య.. కత్తిపోట్లతో వ్యక్తి మృతి
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ అండాలమ్మ కాలనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో జలగుట్ట వద్ద ఓ వ్యక్తి కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక వివరాల ప్రకారం మృతుడు మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన లక్పతి నాయక్‌గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.
ఇంత దారుణంగా హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హత్యకు పాల్పడిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
