ప్రజాదర్బార్‌లో సమస్యలకు సత్వర పరిష్కారం: మంత్రి సీతక్క
ములుగు, ఆంధ్రప్రభ బ్యూరో : ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
మంగపేట మండల పరిధిలోని అక్కినేపల్లి మల్లారం, బ్రాహ్మణపల్లి, రాజుపేట, కత్తిగూడెం, నిమ్మగూడెం, దోమెడ, రామచంద్రునిపేట, వాడేగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి, వాగుడుగూడెం గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటిని సత్వరంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ., సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
