రహదారుల అభివృద్ధికి బాటలు వేస్తున్న భట్టీ ..
బోనకల్‌లో రూ.17.48 కోట్ల రహదారి పనుల శంకుస్థాపన
గ్రామీణ రహదారుల అనుసంధానానికి పెద్దపీట..
బోనకల్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది అన్న లక్ష్యంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రామీణ రహదారుల అనుసంధానాలకు ప్రాధాన్యతను ఇస్తూ వాటి నిర్మాణాలకు నిధులను కేటాయిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా, బోనకల్ మండలంలో రూ.17.48 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం బుధవారం శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయితే మండలంలోని పలు గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
శంకుస్థాపనలు జరిగిన రహదారులు ఇవే..
మండలంలో వివిధ గ్రామాలను అనుసంధానించే రహదారుల నిర్మాణంలో భాగంగా చిరునోముల–వత్సవాయి రహదారి నిర్మాణానికి రూ.3.20 కోట్లు, ముష్టికుంట్ల–గార్లపాడు రహదారికి రూ.5.50 కోట్లు, ముష్టికుంట్ల ఎస్సీ కాలనీలో అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.73 లక్షలు కేటాయించారు.
అదేవిధంగా బోనకల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి చిరునోముల వరకు రూ.3.30 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, ముష్టికుంట్ల నుంచి నాగులవంచ మీదుగా చొప్పకట్లపాలెం వరకు రూ.4.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారి పనులకు భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: కర్నాటి
కాంగ్రెస్ మండల అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రహదారుల నిర్మాణం, అభివృద్ధి ద్వారా గ్రామాల మధ్య దూరాలు తగ్గి, రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించుకునే అవకాశం కలుగుతుందన్నారు. రహదారుల నిర్మాణం బాగుంటే అత్యవసర వైద్య సేవ విభాగాలకు ఆటంకాలు ఉండవన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, డీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, సర్పంచులు పిల్లలమర్రి నాగేశ్వరరావు అనుమోలు చంద్రకళ, బద్రు నాయక్, నాయకులు గాలి దుర్గారావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి సుబ్బారావు, బంధం నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
