కర్నూలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్, స్వర్ణగిరి గోల్డ్ మైన్ జిల్లాకు వరం
కర్నూలు–బళ్లారి జాతీయ రహదారిని వేగవంతం చేయాలి: ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, గత రెండేళ్లలో కర్నూలు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అందుకు నిదర్శనమని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు అన్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు.
భారతదేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 13 పారిశ్రామిక కారిడార్లలో ఓర్వకల్లుకు స్థానం దక్కడం కర్నూలు జిల్లాకు లభించిన గొప్ప అవకాశమని ఎంపీ పేర్కొన్నారు. ఈ కారిడార్లో భాగంగా ఓర్వకల్లులో మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని తెలిపారు.
స్వర్ణగిరిగా జొన్నగిరి
జొన్నగిరి ప్రాంతాన్ని భవిష్యత్తులో ‘స్వర్ణగిరి’గా తీర్చిదిద్దే లక్ష్యంతో గోల్డ్ మైన్ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం కావడం, రెండో దశ విస్తరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయడం జిల్లాకు గర్వకారణమని నాగరాజు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్య, ఉపాధి, సాగునీటిపై దృష్టి
పారిశ్రామిక రంగంతో పాటు విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా హంద్రీ-నీవా ప్రాజెక్టు పరిధిలోని వేదావతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు.
హంద్రీ-నీవా కాల్వల ద్వారా నీటి సరఫరాను మరింత విస్తరించి, వివిధ స్లూయిస్ల ద్వారా స్వర్ణగిరి ప్రాంతానికి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. సాగునీటి వసతులు మెరుగుపడితే వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
కర్నూలు–బళ్లారి జాతీయ రహదారిని పూర్తి చేయాలి
జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని కర్నూలు–బళ్లారి జాతీయ రహదారి నిర్మాణం అత్యంత అవసరమని ఎంపీ స్పష్టం చేశారు. ఈ రహదారి పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలు విస్తరించడంతో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. అందువల్ల కర్నూలు పార్లమెంట్ ప్రజల తరఫున కర్నూలు–బళ్లారి జాతీయ రహదారి ప్రాజెక్టును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు.
