Farmer-Crisis : అయ్యో,, రైతన్న…! Andhra Prabha Top Story

Farmer-Crisis : అయ్యో,, రైతన్న…! Andhra Prabha Top Story

  • అందరూ దగాకోరులే
  • సలహా ఇచ్చేటోడే..
  • మందు అమ్మేస్తాడు
  • సమస్య తెలిసినోడే
  • ఉత్పత్తి చెబుతున్నాడు
  • ఇది రైతు అవసరమా?
  • మార్కెట్ పన్నాగమా?
  • ఉత్పత్తి రైతుదే
  • వినిమయమూ అతడిదే
  • వ్యవసాయ శాఖ ది ప్రేక్షక పాత్ర

(అర్ధవీడు , ఆంధ్రప్రభ )

పైరు సస్యరక్షణలో, శాస్త్రియ యాజమాన్య నిర్వహణలో రైతు చెవిని ఇప్పుడు ఎవరి మాటలు తాకుతున్నాయి.? మందులు అమ్మేవాడే సలహా దారుడైతే.. పైరు సమస్యను గుర్తించేవాడే తయారీదారుడైతే రైతు స్థితి ఏమిటీ? రైతు చేతికి అందుతున్న మందులు అతని అవసరానికా? లేదా మార్కెట్ లాభాలకా? బాధ్యతల నుండి వ్యవసాయ శాఖ క్రమేణా దూరమవుతున్న వేళ రైతాంగంలో తలెత్తుతున్న ప్రశ్నలివి.

Farmer-Crisis : నడి సంద్రంలో రైతన్న

అర్థవీడు మండలంలో గత ఫిబ్రవరి, మార్చి నెల నుండి ముందస్తు లేదా వేసవి పత్తి సాగవుతోంది. అత్యధిక సాగు అశ్వని కార్తె నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం పూత, పింద దశలో ఉంది. జూన్ మధ్య రోజుల్లో కురిసిన చిన్నపాటి వర్షం తరువాత చీడ పీడల దాడి పెరిగింది. తెల్ల, పచ్చదోమ, పిండి నల్లి ఉదృతి పెరిగింది. ఇవి గాక రైతు స్థాయిలో గుర్తించ లేని పోషక లోప సమస్యలు వున్నాయి. తక్షణమే నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. లేక పోతే పూత, పిందే నేల రాలి చెట్లు మోడువారుతాయి. నిప్పులు చిమ్మే ఎండను సైతం లెక్క చేయక రైతు పడ్డ శ్రమ, పెట్టిన పెట్టుబడి, మొక్కలు బతకడానికి పారించిన భూగర్భ జలాలు, వీటిని తోడేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉచిత విద్యుత్ వృథా అయిపోతాయి. ఆశించిన దిగుబడి రాక, చేసిన అప్పుల భారం మరింత పెరుగుతోంది. ప్రస్తుత ఈ స్థితి రైతుకు జీవన మరణ సమస్య.

Farmer-Crisis : వేలు విడిచిన అధికార గణం

విత్తు ప్రారంభంలో నాణ్యమైన తమ విత్తనాలే కొనుగోలు చేయాలని ఏసీ కార్లల్లో వచ్చిన వివిధ కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేశారు. అమ్మకాలు చేసుకున్నారు. చీడ పీడలు ఆశించిన ఈ దశలో మళ్ళీ ఏసీ కార్లల్లో వచ్చిన మందుల కంపెనీల ప్రతినిధులు వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి నివారణకు తమ ఉత్పత్తులను రికమెండ్ చేస్తున్నారు. వ్యాపారం ముమ్మరంగా సాగిస్తున్నారు. నేరుగా దుఖానాలకు వెళ్లిన రైతులకు ఆ యజమానులు అమ్మకందారులు కమ్ సలహాదారులుగా మారిపోతున్నారు. పత్తి ఉత్పత్తిదారులు అయిన రైతులు తమ సహజత్వాన్ని వీడి కేవలం కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారులుగా మారిపోయారు. ఈ దశల్లో వ్యవసాయ శాఖ రైతులకు నాణ్యమైన విత్తన ఎంపిక, శాస్త్రీయ యాజమాన్యం పై సలహా సూచనలు ఇవాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా మొదటి దశలో ఇంటి పన్ను వసూళ్లు, హౌస్ మ్యాపింగ్ లో బిజీ అయి పోయింది. ఇప్పుడేమో ఓటర్ల జాబితా సమీక్షలో తీరిక లేకుండా ఉంది.తండ్రి స్థానంలో వుండి రైతుల వేలు పట్టి నడిపించాల్సిన వ్యవసాయశాఖ పరాయి పిల్లల్లా తన చేయిని విధుల్చుకుంది. ఈ పరిస్థితుల్లో రైతుల సలహా వ్యవస్థలో కంపెనీల, షాపుల ప్రభావం పెరిగింది.

Farmer-Crisis : బంధించి మరీ బాదుడు

పంట పరిశీలన చేసిన కంపెనీల ప్రతినిధులు ఆర్గానిక్, బయో, ప్రత్యేక ఫార్ములా వంటి ఉత్పత్తులను సిఫార్సు చేస్తున్నారు. వీటి ధరలు సాధారణ మందులతో పోలిస్తే అధికమని రైతులు చెబుతున్నారు. ఇక్కడే అవి అవసరమా అదనపు ఖర్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో ఫలితాన్ని ఇచ్చిన మందును కోరిన వారిని షాపు వద్ద తిష్ట వేసిన ప్రతినిధులు మరో సారి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. షాప్ యాజమానీ అందుకు సహకరిస్తున్నారనే విమర్శలు వున్నాయి. ఇక్కడే పైరులో సమస్యను గుర్తించిన వాడే ఉత్పత్తిని సూచిస్తున్నపుడు ఆ సలహా పూర్తి రైతు అవసరానికే పరిమితమా అనే సందేహం తలెత్తుతుంది. నేరుగా వెళ్లిన రైతులకు షాప్ యజమాని డిమానుస్ట్రేటర్ గా మారిపోతున్నాడు. ఫలానా వారు తీసుకెళ్లారు… రిజల్ట్ చించేసింది అంటూ ఆ కంపెనీ మందులే అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు.అప్పయినా, క్యాష్ అయినా ఇదే తంతు. పైరు దశ ఏదైనా, చీడ పీడా ఏదైనా ఆ మందే రైతు చేతిలో కనిపిస్తున్నాయి. ఒక వేళ మొండిగా ఫలాన మందే కావాలనీ పట్టుబడితే దాంతో పాటు ఆర్గానిక్, బయో పేరుతో ఉండేవి తప్పనిసరి చేస్తున్నారనే విమర్శ లేక పోలేదు. లేదా రైతు కొరింది లేదనే సమాధానం వినిపిస్తోంది. గత రెండేళ్లుగా పత్తి కైనా, మిర్చి కయినా సర్వ రోగ నివారిణిలా డైటాన్, డాలర్ అనే మందులను అమ్మేవారు. వాటినే ఇప్పుడు కోరినా ఇవ్వకుండా అంతకు మించి అంటూ మరో రకం ఇస్తున్నారని ఓ దుఖానం ఖాతాదారులు చెబుతున్నారు. ఆ ఉత్పత్తుల కంపెనీ ఏజంట్లు ఆ షాపునకు అనుసంధానంగా లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది.ఈ పరిస్థితిలో రైతు స్వతంత్ర నిర్ణయం పై మార్కెట్ ప్రభావం బలంగా పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.