Priyadarshi|అప్పుడు చిన్న పాత్ర.. ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోగా

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సినిమా పరిశ్రమలో విజయం అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కేవలం సక్సెస్ అవ్వడమే కాకుండా, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవడం అంటే అది నిజంగా విశేషమనే చెప్పాలి. ఒకప్పుడు ఒక దర్శకుడి బ్యానర్‌లో వచ్చిన సినిమాలో చిన్న పాత్ర చేసిన నటుడే.. ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోగా సినిమా చేస్తే, ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

టాలీవుడ్‌లో కంటెంట్ ఉన్న నటులను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి విలక్షణ నటుల్లో ప్రియదర్శి ఒకరు. అటు సహాయ నటుడిగా మెప్పిస్తూనే, ఇటు చిన్న చిత్రాలలో హీరోగా నటిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమా అధికారికంగా ప్రకటించబడింది.

‘దర్శకుడు’ టు ‘హీరో’..

ఇందులో విశేషం ఏమిటంటే.. 2017లో సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో వచ్చిన ‘దర్శకుడు’ సినిమాలో ప్రియదర్శి ఒక చిన్న పాత్రలో నటించారు. ఇప్పుడు సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత అదే ప్రతిష్టాత్మక బ్యానర్‌లో ఆయన హీరోగా నటిస్తున్నారు. పూర్తి తెలంగాణ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ (బన్నీ వాసు) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హీరోయిన్‌గా యూట్యూబ్ సెన్సేషన్ ..

ఈ సినిమా ద్వారా యూట్యూబ్‌లో జానపద పాటలు, తన అద్భుతమైన డ్యాన్స్‌తో సెన్సేషన్‌గా మారిన నాగదుర్గ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం కానుంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న నాగదుర్గ, ప్రియదర్శి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

‘పెళ్లిచూపులు’ చిత్రంతో కామెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి.. ‘మల్లేశం’, ‘బలగం’ చిత్రాలతో హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.