శ్రీరత్న విద్యాలయం బోనాల సందడి

సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థుల సందడి..

సంగెం, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): మండలంలోని మొండ్రాయి గ్రామంలో ఉన్న శ్రీరత్న విద్యాలయంలో పోచమ్మ బోనాల వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చిక వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ మచ్చిక శ్రీలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకల్లో విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు పోతురాజు వేషధారణతో అలరించారు. దేవులపల్లి హేమంత్‌, ఇంతల ప్రేమ్‌సాయి పోతురాజు వేషాల్లో ఆకట్టుకున్నారు. ఐదో, ఏడో తరగతులకు చెందిన విద్యార్థినులు నెత్తిన పోచమ్మ బోనాలను మోసుకుంటూ, చేతుల్లో వేపకొమ్మలు పట్టుకుని సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, బోనాల ఆటపాటలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థుల సంప్రదాయ వేషధారణ, బోనాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వేడుకలను వీక్షించిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మచ్చిక వెంకటేశ్వర మాట్లాడుతూ.. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్ వనజ, ఉపాధ్యాయినులు మంజుల, సునీత, మౌనిక, రమ్యశ్రీ, సంధ్య, ప్రవళికతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.