పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్‌

  • పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం..
  • పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలిచారు. పార్టీ తరఫున ఆ కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తం రూ.2.25 కోట్లను పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున అందించనున్నారు.

చదువుకు, భవిష్యత్తుకు అండగా..

పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించి తదుపరి చర్యలు నిర్ణయిస్తారని కేసీఆర్‌ తెలిపారు. పెద్ది కుటుంబానికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.