యువతకు ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం..
నారా లోకేష్ కృషి అభినందనీయం..
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డా. కొమ్మాలపాటి శ్రీధర్
నరసరావుపేట, (ఆంధ్రప్రభ): రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఆయన తీసుకుంటున్న చర్యలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
దేశీయ, విదేశీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు యువతకు స్వరాష్ట్రంలోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నారా లోకేష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు.
యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గించి, స్వరాష్ట్రంలోనే విస్తృత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని శ్రీధర్ అన్నారు. అభివృద్ధి, పారదర్శకత, సాంకేతికత ఆధారిత పాలనపై నారా లోకేష్ చూపుతున్న దృక్పథాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని రాష్ట్రంలో ఏర్పడుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధి కల్పన, పరిశ్రమల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువతకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తోందన్నారు.
మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ ఆరోపణలు ఖండిస్తున్నాం..
మెగా డీఎస్సీ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను డా. కొమ్మాలపాటి శ్రీధర్ తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
కూటమి ప్రభుత్వం చేపడుతున్న నియామక ప్రక్రియపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువతలో అనవసరమైన అపోహలు సృష్టించవద్దని వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు. మెగా డీఎస్సీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యువత, నిరుద్యోగులు గమనించాలని, ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి సృష్టి, యువతకు అవకాశాల కల్పన, నవ్య ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల సహకారం మరింత బలాన్ని ఇస్తుందని కొమ్మాలపాటి శ్రీధర్ పేర్కొన్నారు.
