కలెక్టర్ సారూ.. ఇటు చూడండి..?
నిర్మాణ దశలోనే కూలిన మురుగు కాలువ గోడ
కాంట్రాక్టర్ల, నిర్వహణ అధికారుల నిర్లక్ష్యం!
నాసిరకం పనులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు…
రూ.76 లక్షల పనుల్లో నాణ్యతపై స్థానికుల అనుమానాలు
కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు.. సమగ్ర విచారణకు డిమాండ్
కుబీర్, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో నిర్మిస్తున్న మురుగు కాలువ గోడ నిర్మాణ దశలోనే కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. రూ.76 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వడ్డెర కాలనీలో ప్రతి వర్షాకాలంలో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసులు పలుమార్లు తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పత్రికలు, ఇతర మాధ్యమాల ద్వారా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చారు. కాలనీతో పాటు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో కాలనీ నుంచి పెద్దవాగు వరకు మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.
జిల్లా కలెక్టర్ సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు మంజూరు చేయించడంతో తమ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాలనీవాసులు ఆశించారు. పనులు ప్రారంభమైనప్పటి నుంచే నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తాజాగా నిర్మాణం పూర్తికాకముందే మురుగు కాలువ గోడ కూలిపోవడంతో పనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి. నిర్మాణ సామగ్రి నాణ్యత, పనుల పర్యవేక్షణ, కాంట్రాక్టర్ల పనితీరుపై సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు
ప్రజాధనంతో చేపడుతున్న భారీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ.. నిర్మాణ దశలోనే గోడ కూలడం ఆ పర్యవేక్షణ తీరుపై అనుమానాలకు తావిస్తోందని కాలనీవాసులు పేర్కొన్నారు. పనుల్లో లోపాలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి సరిదిద్దాల్సిన అధికారులు ఇప్పుడు స్పందించాలని కోరుతున్నారు.
మురుగు కాలువ నిర్మాణం పూర్తయితే వర్షాకాలంలో నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించిన తమకు ఈ ఘటన ఆందోళన కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. నాసిరకం పనుల వల్ల మళ్లీ ప్రజాధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.
నిర్మాణ పనుల నాణ్యతపై సాంకేతికంగా సమగ్ర విచారణ చేపట్టి, లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. కూలిన గోడను నాసిరకంగా కాకుండా నాణ్యతా ప్రమాణాలతో పునర్నిర్మించి, కాలనీ మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
