అధికారం పోయిన అక్కసే.. హరీష్ రావుకు సీతక్క కౌంటర్
నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత హరీష్ రావు అబద్ధాలకు నిలువుటద్దమని, అధికారం కోల్పోయిన అక్కస్సుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాడని ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి సీతక్క అన్నారు.
సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అచ్చంపేటలో ఒక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ ముమ్మాటికి నాగర్ కర్నూల్ జిల్లా వాసీ అని, నల్లమల్ల బిడ్డని, శౌర్యం పౌరుషం ఉన్న వ్యక్తి అని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రుణాలు తెచ్చి భారాలు మోపి వడ్డీలపై వడ్డీలు చేసిన నిజాన్ని ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మీ మరదలు కవిత మీపై ఆరోపణలు చేస్తోందని వాటికి సమాధానాలు చెప్పాలన్నారు. ప్రజలకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తామని ఒక్క సీటు ఓడిపోయినా.. గెలిచిన అందరం రాజీనామాలు చేస్తామని సవాల్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి మార్కెట్ చైర్మన్ రమణ రావు తదితరులు పాల్గొన్నారు.
