అర్జీల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి అవసరం..

  • 409 అర్జీలు స్వీకరించిన జిల్లా యంత్రాంగం
  • ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించాలి
  • ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
  • అధికారులకు కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశం

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్వో నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, భరత్ నాయక్, రోస్‌మాండ్‌లతో కలిసి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరిష్కారం కోసం వచ్చిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

శాఖల వారీగా అందిన అర్జీలు వివరాలు..
పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 409 అర్జీలు అందాయి. శాఖల వారీగా పరిశీలిస్తే… అత్యధికంగా రెవెన్యూ -208, సెర్ప్ -12, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ -10, పోలీస్ శాఖ -12, పంచాయతీ రాజ్ -30, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ -5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ -11, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్-23, గ్రామీణ అభివృద్ధి-2, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు-2, విద్యుత్ శాఖ-2 ఆర్టీసీ-3, పౌరసరఫరాల -5, తుడా -3, ఆరోగ్యం-3, విద్యాశాఖ -16, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల -23, నీటి పారుదల – 3, ఎల్డీఎం-1, ఇంటర్మీడియట్-4, కుటుంబ సంక్షేమ శాఖ -2, వ్యవసాయం-3, గనులు భూగర్భ శాఖ-1, గిరిజన సంక్షేమ శాఖ-2, వికలాంగుల సంక్షేమ శాఖ-1, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ -1, సమగ్ర శిక్ష – 4, మహిళా శిశు సంక్షేమ శాఖ-2, టీటీడీ-1, రుయా హాస్పిటల్-1, జాతీయ రహదారులు -2, ఆర్డబ్ల్యూ ఎస్ -1, సాంఘిక సంక్షేమ శాఖ -3, బీసీ సంక్షేమ శాఖ -2, హౌసింగ్ -1, దేవాలయ శాఖ-1, మహాత్మా జ్యోతిబా పూలే – 3 చొప్పన అర్జీలు అందాయి. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.