డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి

డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును నిర్మించుకోండి

  • మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి పిలుపు

మేడ్చల్, ఆంధ్రప్రభ : యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హితం కళాశాలలో మేడ్చల్ పోలీసుల ఆధ్వర్యంలో “సే నో టు డ్రగ్స్” అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ శంకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సదస్సులో మేడ్చల్ సీఐ ఎ. సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం ప్రకారం డ్రగ్స్ సేవించినా, విక్రయించినా కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.

విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలపై సమాచారం తెలిసినా, అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని కోరారు.

డ్రగ్స్ విక్రయించే వ్యక్తులపై సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులందరితో “డ్రగ్స్ వద్దు.. జీవితమే ముద్దు” అనే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో పాటు సుమారు 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.