Jawahar Nagar | వేడినీటి బకెట్ లో పడి బాలుడి మృతి

జవహర్ నగర్, మార్చి 25 (ఆంధ్రప్రభ ) : జవహర్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటున్న బాలుడు వేడినీటి బకెట్లో పడడంతో గాయాలై చికిత్సపొందుతూ ఇవాళ‌ మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సెదయ్య తెలిపిన వివరాల ప్రకారం… జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మార్కెట్ లైన్ కాటి నర్సింహా భార్య సుమలత ఇద్దరు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. నర్సింహా స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పిల్లలను చూడటానికని సుమలత తల్లి పులమ్మ నర్సింహా ఇంటికి వచ్చింది. ఈనెల 23న సమీపంలో ఉన్న నర్సింహా సోదరుడు సాయి ఇంటికి పుల్లమ్మ మనమడు కాటి బన్నీ (4)ని తీసుకుని వెళ్ళింది.

స్నానానికి వాటర్ హీటర్ ను పెట్టిన సాయి కుటుంబ సభ్యులు హీటర్ తీసి బకెట్ ను అక్కడే ఉంచారు. కుటుంబ‌ సభ్యులు మాటామంతిలో పడ్డారు. ఈ క్రమంలో బన్నీ వెనక నుంచి ఆడుకుంటూ వేడినీటి బకెట్ వద్దకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు బన్నీని బయటకు తీసి చూడగా ఛాతీభాగం కాలిపోయింది. వెంటనే స్థానికంగా హాస్పిటల్ కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ‌ ఉదయం మరణించాడు. అల్లారుముద్దుగా ఆడుకుంటూ ఇంట్లో సందడిగా ఉండే చిన్న కుమారుడు బన్నీ మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply