Achchennaidu-Warning : ఎరువుల కొరత ఉండదు..Andhra Prabha Top News
Achchennaidu-Warning : ఎరువుల కొరత ఉండదు..Andhra Prabha Top News
- అక్రమాలకు తావులేదు
- బలవంతపు విక్రయాలపై ఉక్కుపాదం
- కౌలు రైతుల్ని ఇబ్బంది పెట్దొద్దు
- ఆండ్రాయిడ్ ఫోన్ లేకున్నా పర్వాలేదు
- ప్రతి బస్తాకు పూర్తి లెక్క ఉండాల్సిందే
- ఎంఆర్పీకి మించితే కఠిన చర్యలు
- అక్రమాలపై క్రిమినల్ కేసులు తప్పవు
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
( ఆంధ్రప్రభ, అమరావతి)
ఖరీఫ్-2026 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎరువుల లభ్యత, పంపిణీ, నిల్వలు, సరఫరా పరిస్థితులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వివిధ ఎరువుల తయారీ సంస్థల ప్రతినిధులు, డీలర్ల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అవసరమైన మేరకు మాత్రమే కాకుండా, అవసరానికి మించి కూడా ఎరువుల నిల్వలు అందు బాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా యూరియా సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అధికారులు, కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. యూరియా లేదా డీఏపీ కొనుగోలు చేసే రైతులకు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువులు విక్రయించే ధోరణిని వెంటనే నిలిపివేయాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను మాత్రమే అందించాలని, అనవసరమైన ఉత్పత్తులను బలవంతంగా విక్రయించడం సహించబోమని హెచ్చరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, సంబంధిత కంపెనీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Achchennaidu-Warning : ఎంఆర్పీ పెంచితే కేసులే

ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ ధరలకు యూరియా విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్న మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎరువుల డీలర్లు ఎంఆర్పీ ధరకే విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎరువుల బస్తాకు పూర్తి లెక్క ఉండేలా పటిష్ట పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయనున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు పునరావృతమైతే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని హెచ్చరించారు. రైతులకు ఎరువుల బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న యాప్ నిర్వహణ మరింత సజావుగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా కౌలు రైతులు, ఆండ్రాయిడ్ ఫోన్ లేని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటీపీలు ఆలస్యంగా రావడం, మెసేజ్ లింకులు సకాలంలో అందకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Achchennaidu-Warning : పర్యావరణ హిత సేధ్యమే లక్ష్యం

వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులతో పాటు పర్యావరణ హిత విధానాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో సహజ వ్యవసాయంపై రైతుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోందని, దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల సారంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్న మంత్రి, సాధ్యమైనంత మేర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సమతుల్య పోషకాల వినియోగంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అధిక ఎరువుల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం, ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
