Voter Verification | ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే ఏం చేయాలి?

Voter Verification | ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే ఏం చేయాలి?

ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సూచనలు

Voter Verification | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) ప్రక్రియను చేపట్టింది. 2002 తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో ఓట్ల వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ప్రక్రియలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపడం అత్యంత కీలకం. ఒకవేళ ఈ ఫామ్ సబ్మిట్ చేయకపోతే భవిష్యత్తులో మీ ఓటు గాల్లో పడే ప్రమాదం ఉంది.

ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏమిటి?
ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఓటర్ల వివరాలను సరిచూసుకోవడానికి, పాత రికార్డులతో అనుసంధానించడానికి ఎన్నికల సంఘం రూపొందించిన ఒక పత్రం. ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు, మరణించిన వారి పేర్లను తొలగించి, డేటాను శుద్ధి చేయడానికి ఈ ప్రక్రియ చేపడతారు.

ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ నింపొచ్చా?

మీరు బూత్ లెవల్ ఆఫీసర్ కోసం ఎదురు చూడకుండా, మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారానే సులభంగా ఆన్‌లైన్‌లో ఫామ్ సమర్పించవచ్చు.
ముందుగా https://voters.eci.gov.in అధికారిక పోర్టల్‌ను సందర్శించండి. తరువాద మీరు కొత్త వినియోగదారులైతే, మీ మొబైల్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోండి. ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత, ‘ ఫిల్‌ ఎన్యూమరేషన్ ఫామ్ (Fill Enumeration Form)’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ EPIC నంబర్ (ఓటర్ ఐడి) ఎంటర్ చేసి ‘సర్చ్‌’ క్లిక్ చేయండి. మీ వివరాలు కనిపిస్తాయి. అడిగిన వివరాలను సరిచూసుకుని, అవసరమైన సమాచారాన్ని నింపి ఫామ్‌ను సబ్మిట్ చేయండి. ఆన్‌లైన్ ప్రక్రియలో ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తవుతుంది.

బీఎల్‌ఓలు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి?

  • మీ ప్రాంతంలోని బీఎల్‌ఓ మీకు ఫామ్ అందించకపోయినా, మీరు వారిని కలవలేకపోయినా పైన పేర్కొన్న విధంగా నేరుగా ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫామ్ నింపవచ్చు.
  • వెబ్‌సైట్‌లో ” బుక్‌ ఏ కాల్‌ విత్‌ బీఎల్‌ఓ ” అనే సదుపాయాన్ని ఈసీఐ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు మీ వివరాలను ఇచ్చి బీఎల్‌ఓ ని మిమ్మల్ని సంప్రదించేలా అభ్యర్థించవచ్చు.
  • ఏవైనా ఫిర్యాదులు ఉంటే ‘నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్’ (https://voters.eci.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు..

  • ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా, మీ వద్ద గతంలో ఉన్న ఎలక్టోరల్ రోల్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
  • ఒకవేళ మీ వివరాలు డేటాబేస్‌తో సరికాకపోతే , అధికారులు నోటీసు జారీ చేస్తారు.
  • బీఎల్ఓలు వచ్చిన సమయంలో పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను (పాస్‌పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రాలు మొదలైనవి) సిద్ధంగా ఉంచుకోవాలి.