కులాలతో రాజకీయం చేస్తున్న వైసిపి…
వ్యవస్థలను ఐదు సంవత్సరం బ్రష్టు పట్టించిన జగన్.
గంజాయి, రౌడీయిజం రహిత నగరంగా విజయవాడ
సాయి కృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తాం
వైసీపీ హయాంలో పోలీస్ స్టేషన్లు టార్చర్ సెల్స్‌గా పోలీస్ స్టేషన్లో
గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్..
అసాంఘిక శక్తులపై డ్రోన్లతో నిఘా
చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఐదు సంవత్సరాలపాటు పోలీస్ స్టేషన్లను టార్చర్ సేల్స్ గా మార్చిన వైసిపి ఇప్పుడు కులాలతో రాజకీయం చేయాలని చూస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం నగరంలోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో, విజయవాడలో అనేక అరాచకాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గంజాయి విక్రయాలు, డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా సాగాయని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటి నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల సాయంతో చర్యలు చేపడుతోందని తెలిపారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విజయవాడను గంజాయి, రౌడీయిజం లేని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ సాయి కృష్ణ అదృశ్యం కేసులో ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కాదంబరి జత్వాని కేసు, డాక్టర్ సుధాకర్ ఘటన, అమరావతి మహిళలపై దాడులు వంటి సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రజలు వాటిని మరచిపోలేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేయడం ఆ అసంతృప్తికే నిదర్శనమని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లు టార్చర్ సెల్స్‌గా మారాయని, ప్రతిపక్ష నేతలు, సామాన్య ప్రజలు వేధింపులకు గురయ్యారని విమర్శించారు. విజయవాడ నగరానికి డ్రగ్స్ కేంద్రంగా చెడ్డపేరు తీసుకొచ్చారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నగరంలో శాంతిభద్రతలు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని, కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గొరిపర్తి నామేశ్వరరావు, పేరేపి ఈశ్వర్, ఎస్. ఫిరోజ్, పెద్ద అన్నారావు, గల్లా శ్రీను, కొర్రా అప్పన్న, రాయి రంగమ్మ, కొక్కిలి తిరుపతయ్య, భాగం సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
