నిరుద్యోగంతో యువకుడి ఆత్మహత్య..

సిరికొండ, ఆంధ్రప్రభ : మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన దొమ్మటి నితిన్ గౌడ్ (27) అనే యువకుడు లొంక అడవుల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్సై అందించిన వివరాల ప్రకారం… నితిన్ గౌడ్ ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడం, దానికి తోడు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే నిన్న (ఆదివారం) ‘లొంక ఆలయానికి వెళ్తున్నాను’ అని ఇంట్లో చెప్పి, తన హోండా షైన్ బైక్‌పై బయలుదేరాడు. లొంక తండా దాటిన తర్వాత రోడ్డు పక్కన తన బైక్‌ను నిలిపివేసి, సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక టేకు చెట్టుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. శవాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.