మత్తుతో జీవితాలను చిత్తు చేసుకోవద్దు..
మత్తుతో జీవితాలను చిత్తు చేసుకోవద్దు..
- ఎక్సైజ్ సి ఐ రవి చంద్రారెడ్డి
మోత్కూర్, ఆంధ్రప్రభ : యువత మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె. రవిచంద్ర రెడ్డి సూచించారు. నషా ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిరోధంపై సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ, తాత్కాలిక ఆనందం కోసం యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని కళాశాలలకు పంపిస్తున్నారని, ఆ ఆశలను వమ్ము చేసి జీవితాలను బలి చేసుకోవద్దని హితవు పలికారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో డ్రగ్స్ నిరోధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కౌన్సిలర్ సీహెచ్. లింగస్వామి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె. నరసింహారెడ్డి, అధ్యాపకులు బి. పురుషోత్తం రెడ్డి, కె. శ్యామ్, వై. నర్సిరెడ్డి, డి. మంజుల, బి. నరసింహతో పాటు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
