ప్రైవేట్ పాఠశాల బస్సు నిలిపివేత.. న్యావనందిలో కలకలం

ప్రైవేట్ పాఠశాల బస్సు నిలిపివేత.. న్యావనందిలో కలకలం

  • ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని గ్రామస్తుల తీర్మానం
  • గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
  • విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం

సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో సోమవారం ఉదయం ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును గ్రామస్తులు నిలిపివేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో న్యావనంది గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు గ్రామానికి చెందిన పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం.

ఈ తీర్మానాన్ని ఉల్లంఘిస్తూ ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం గ్రామానికి బస్సును పంపి విద్యార్థులను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు బస్సును అడ్డుకుని నిలిపివేసినట్లు తెలిసింది.

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి వీడీసీ కృషి

న్యావనంది గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామ అభివృద్ధి కమిటీ విశేషంగా కృషి చేసింది. పాఠశాలలో మూత్రశాలల నిర్మాణం, ప్రహరీ గోడ ఏర్పాటు, విద్యా వాలంటీర్ల నియామకం వంటి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలంటూ గ్రామస్థులు తీర్మానించినట్లు తెలిపారు.

అయితే ఆ తీర్మానాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ పాఠశాల బస్సు గ్రామానికి రావడంతో గ్రామస్తులు దానిని నిలిపివేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.