పీ4తో పేద కుటుంబాలకు ఉపాధి బాట

20 తోపుడు బండ్ల పంపిణీ..

స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్ లక్ష్మీ షా

విజయవాడ, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమానికి దాతలు అండగా నిలుస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ 10, ఎన్‌ఆర్‌ఐలు డాక్టర్ మాధవ్, అపర్ణల సహకారంతో మరో 10 తోపుడు బండ్లు అందించగా, మొత్తం 20 బంగారు కుటుంబాలకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు.

సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా లబ్ధిదారులకు తోపుడు బండ్లు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేద కుటుంబాలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పీ4 కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ప్రభుత్వంతో పాటు సమాజంలోని దాతలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావడం వల్ల అర్హులైన కుటుంబాలకు మరింత సహాయం అందుతోందని తెలిపారు.

ఒక్కో తోపుడు బండిని సుమారు రూ.10 వేల వ్యయంతో తయారు చేసి చిరు వ్యాపారులకు అందించడం అభినందనీయమన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.

విదేశాల్లో ఉన్నప్పటికీ స్వస్థలంపై అభిమానంతో పేదల సంక్షేమానికి ముందుకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలు డాక్టర్ మాధవ్, అపర్ణల సేవలను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్న వ్యాపారాలు చేసుకునే కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులను కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ, మానవ సేవే లక్ష్యంగా రెడ్ క్రాస్ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో అవసరమైన కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, కార్యదర్శి చిట్టిబాబు, సభ్యులు బలరాం, రెడ్ క్రాస్ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.