Global Economy | భారతీయుల్లో పెరుగుతున్న ఆందోళన..

Global Economy | భారతీయుల్లో పెరుగుతున్న ఆందోళన..

Global Economy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యుద్ధం వలన ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో ఆందోళన పెంచుతున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో పని చేస్తున్న భారతీయులు కూడా భవిష్యత్‌ పై అనిశ్చితిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే టెక్ కంపెనీలు గత కొన్నేళ్లుగా ఖర్చు నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కొన్ని సంస్థలు నియామకాలను తగ్గించగా, మరికొన్ని ఉద్యోగుల సంఖ్యను కుదించాయి. ఇప్పుడు యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడం వల్ల కంపెనీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఉద్యోగం సురక్షితమేనా? అనే ప్రశ్న చాలా మంది ప్రవాస భారతీయుల మనసుల్లో మొదలైంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా పై పని చేస్తున్న ఉద్యోగుల్లో ఈ ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగం కోల్పోతే వీసా, నివాసం, కుటుంబ భవిష్యత్తు పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నారు.

ఐటీకే కాదు.. అందరిలోనూ అదే టెన్షన్..
ఉద్యోగ భయం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాలేదు. రిటైల్, హెల్త్‌ కేర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్నవారిలో కూడా భవిష్యత్‌పై ఆందోళన పెరుగుతోంది. జీవన వ్యయం పెరగడం, ఇంటి అద్దెలు అధికం కావడం, రోజువారీ ఖర్చులు భారంగా మారడం వల్ల చాలా మంది ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఖర్చు చేయడానికి వెనుకంజ..
ఆర్థిక అనిశ్చితి కారణంగా ప్రజలు కొత్త పెట్టుబడులు, పెద్ద మొత్తంలో కొనుగోళ్లు, విలాస వస్తువుల పై ఆసక్తి తగ్గిస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో అవసరం లేని ఖర్చులు ఎందుకు?” అనే భావన బలపడుతోంది. దీంతో వినియోగదారుల వ్యయం తగ్గే అవకాశం ఉందని, అది మళ్లీ వ్యాపారాల పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌పై ప్రభావం ఉంటుందా?
అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే దాని ప్రభావం భారత ఐటీ రంగంపై కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే భారత ఐటీ కంపెనీలకు అమెరికా ప్రధాన మార్కెట్. అక్కడి కంపెనీలు ఖర్చులు తగ్గిస్తే కొత్త ప్రాజెక్టులు, ఔట్‌సోర్సింగ్ ఒప్పందాల పై ప్రభావం చూపవచ్చు. అయితే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉద్యోగాలు భారీ స్థాయిలో కోల్పోయే పరిస్థితి కనిపించకపోయినా, అనిశ్చితి మాత్రం పెరిగిందని చెబుతున్నారు. అందుకే చాలా మంది ఉద్యోగులు ఖర్చులను నియంత్రిస్తూ, ప్రత్యామ్నాయ నైపుణ్యాలను పెంపొందించుకోవడం పై దృష్టి పెడుతున్నారు.

భయం ఉద్యోగాల గురించే కాదు.. భవిష్యత్తు గురించి..
అమెరికాలోని భారతీయుల్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఆందోళన కేవలం ఉద్యోగం పోతుందనే భయం మాత్రమే కాదు. పెరుగుతున్న ధరలు, ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, కుటుంబ భవిష్యత్తు పై ఆందోళన కలిగిస్తోంది. దీంతో మానసిక ఒత్తిడి మరింత పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగుల నుంచి సాధారణ కార్మికుల వరకు దాదాపు ప్రతి ఒక్కరిలోనూ “రేపు ఎలా ఉంటుంది?” అనే ప్రశ్న వినిపిస్తోంది. మరి.. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో.. ఏం జరగనుందో చూడాలి.