Telangana | రోప్‌వే, మ్యూజియంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
Telangana | రోప్‌వే, మ్యూజియంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి
Telangana | ఆంధ్రప్రభ, భువనగిరి: చారిత్రక ప్రాధాన్యం కలిగిన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇవాళ ఉదయం భువనగిరి ఖిల్లాపైకి రోప్‌వే నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భువనగిరి ఖిల్లాను పునరుద్ధరించి దాని చరిత్రను ప్రతిబింబించేలా ఆధునిక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గంటకు సుమారు 300 మంది పర్యాటకులు ఖిల్లాపైకి చేరుకునే విధంగా రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో పర్యాటకులకు సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఖిల్లా ఆకర్షణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
యాదాద్రి, భువనగిరి ఖిల్లా, కొలనుపాక సోమేశ్వర టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ లను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. దీంతో దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించిన జూపల్లి, తెలంగాణ టూరిజాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే దిశగా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ప్రతి నెల కనీసం రెండు రోజులు పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ప్రజలు సమయం కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక ప్రాంతాల సందర్శన ద్వారా ప్రజల ఆలోచనా విధానం విస్తృతమవుతుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
