మొబైల్ ఫోన్ నిషేధం.. విద్యార్ధి సంఘాల ఆగ్రహం..

మొబైల్ ఫోన్ నిషేధం.. విద్యార్ధి సంఘాల ఆగ్రహం..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ మెస్ లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ యూనివర్శిటి అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ జారీ పై ఇటు విద్యార్ధి సంఘాలు, విద్యార్థుల ఖండిస్తున్నాయి. విద్యార్థులకు అందించే అల్పాహారం, భోజనం నాణ్యమైన పరిశుభ్రంగా ఉండాలని విద్యార్థులు కోరుతున్నారు.

మెస్ యాజమాన్యం తప్పిద్ధం
గత కొంత కాలంగా మెస్‌లలో అపరిశుభ్ర పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, విద్యార్థుల ఆరోగ్య భద్రత పై కూడా తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తాయి. ఇలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చినప్పుడు వాటి మూల కారణాలను గుర్తించి పరిష్కరించడం యూనివర్శిటి అధికారుల బాధ్యత. కానీ సమస్యలను పరిష్కరించకుండా వాటిని చిత్రీకరించే ఫోన్ ల పై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మెస్ లలోని డైనింగ్ హాల్‌లో మొబైల్ ఫోన్ నిషేధం వల్ల బొద్దింకలు మాయమవుతాయా అని ప్రశ్నించారు.

ముందుగా యూనివర్శిటి భోజనశాలలో పరిశుభ్రత లేని మెస్ ల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను చూపించిన విద్యార్థులను లక్ష్యంగా చేయడం పై విమర్శలు వస్తున్నాయి. మెస్ లలోని సమస్యలను పరిష్కరించి విద్యార్థుల మనసులను గెలుచుకోవాలని ఆయా విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మొబైల్ ఫోన్లను నిషేధించడం కంటే, విద్యార్థులు భయపడకుండా తమ సమస్యలను తెలియజేయగల వాతావరణాన్ని సృష్టించి వాటిని పరిష్కరించేలా అధికారులు పని చేయాలని, వెంటనే జారీ చేసిన సర్కులర్ ను ఎత్తివేయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.